Search This Blog

20 October 2013

Article 371D

371-డి: రాష్ట్ర సమైక్యతకు శ్రీరామ రక్ష! విభజన వాదంపై బ్రహ్మాస్త్రం! విభజన వాద స్కందావారాన్ని నిలువునా కుదిపేసింది 371-డి అధికరణం. టీ శ్రేణులన్నీ వణికి పోయాయి. ఇది సీమాంధ్రుల కుట్ర - అని మొదట తీవ్రంగా విరుచుకు పడ్డాయి. 371 డి అంటే ఏమిటో చదివిన తర్వాత, విపరీతంగా కంగారు పడ్డాయి. ఆ తర్వాత బుకాయింపులు మొదలయ్యాయి. అది తెలంగాణాకు అడ్డం కాదన్నారు. అది సీమాంధ్రులే ఉంచుకోవచ్చన్నారు. తర్వాత అది మాకు కూడా కావాలన్నారు. ఆర్టికల్ 3 కంటే అది గొప్పదేమీ కాదన్నారు. ఆర్టికల్ 4 లో రెండో సెక్షన్ ముందు అది దిగదుడుపే అన్నారు. 371-డి మొత్తం మార్చాల్సిన అవసరం లేదు - 'తెలంగాణాకి' అన్న ఒక్క మాట చేరిస్తే చాలు అన్నారు. ఆ నాలుగు అక్షరాల మాట చేర్చడానికి 2/3 వంతు పార్లమెంటు తీర్మానం అవసరం లేదన్నారు. బొంబాయోళ్ళకి, పంజాబోళ్ళకి అవసరమొచ్చినప్పుడు - రాజ్యాంగ సవరణ చెయ్యలేదు; తెలంగాణా వాళ్లకి అవసరమైతే సవరణ కావాలనడం కేవలం సీమాంధ్రుల దుష్ప్రచారం అన్నారు. 371-డి 9వ పేరాలో ఒక హంసపాదు వేసి, 'తెలంగాణాకి' అని రాస్తే సరిపోతుంది - ఆ మాత్రం దానికి అదేదో బ్రహ్మాస్త్రం అని సీమాంధ్రులు చెప్పడం మోసం అన్నారు. 371-డి లో కామా కూడా మార్చ లేరు! 371-డి రాజ్యాంగ అధికరణం. రాజ్యాంగానికి 32వ సవరణ ద్వారా 371-డి ఏర్పడింది. అంటే, ఆ రోజు 2/3వ వంతు పార్లమెంటు సభ్యులు ఆమోదం తెలపడం ద్వారా అది ప్రాణం పోసుకొంది. పైగా పదో క్లాజులో దానికి అపార బలం, శాశ్వతత్వం చేకూర్చారు. ఈ అధికరణం రాజ్యాంగంలోని అన్ని అధికరణాలకు మిన్నగా ఉంటుందని స్పష్టం చేసారు. ఈ అధికరణం 7వ షెడ్యూలులో భాగం. ఈ ఈ షెడ్యూలులోని ఏ అధికరణంలో మార్పు చేయాలన్నా 368 ప్రకారం 2/3 మెజారిటీతోనే సాధ్యం! 371-డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఉద్యోగాలు, విద్యా అవకాశాలకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి ఇది, విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోన్లవారీ, స్థానికులు - స్థానికేతరులకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన అధికరణం. 69లో ముల్కీ ఉద్యమం, 72లో జై ఆంద్ర ఉద్యమం వచ్చినప్పుడు - అవి తెలుగు ప్రజల మధ్య వైమనస్యం పెంచినప్పుడు - ఒక శాశ్వత పరిష్కారంగా, అందరి అంగీకారంతో - ఏర్పడినదే 371-డి! ఈ అధికరణం ద్వారా ఇచ్చే స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగంలోని అనేక అధికరణాలకు వ్యతిరేకం. కనుక - మరో ప్రత్యేక రాజ్యాంగ ఆధికరణం చెయ్యవలసి వచ్చింది. విస్తృతమైన చర్చ జరిపి, పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో ఆమోదం తెలిపింది. తెలుగు ప్రజల సమైక్యతకు, రాష్ట్ర సమగ్రతకు భారతదేశం ఇచ్చిన గట్టి హామీ ఈ అధికరణం! ఇది మరో రకంగా ఆంధ్రప్రదేశ్ కలకాలం సమైక్యంగా ఉండటానికి భాట దేశం వెలిబుచ్చిన మహాదాకాంక్ష! 371-డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు హామీ! గత 40 సంవత్సరాలుగా యావదాంధ్ర దేశం ఈ అధికరణానికి అనుగుణంగానే తన జీవన గతిని, ధ్రుతినీ మార్చుకొంది. లక్షలాది కుటుంబాలు ఈ అధికరణం ప్రాతిపదికపైనే తమ భవిష్యత్తును రూపొందించుకున్నాయి. ఈ అధికరణం పెట్టని కోటగా నిలిచి ఉన్నందువల్లనే, విభజన ఉద్యమాలను ఎవ్వరూ లెక్క చెయ్య లేదు! ఈ రాష్ట్ర సమగ్రతకు, ఐక్యతకు దృఢమైన రాజ్యాంగ రక్షణ ఛత్రం ఆసరాగా ఉన్నప్పుడు ఎన్నికల రాజకీయాలకు సంబంధించిన ఉద్యమాలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది? కానీ నాలుగు దశాబ్దాలుగా ఏ చుక్కాని ఆధారంగా కోట్లాది ప్రజలు తమ జీవన నౌకను సజావుగా నడుపుకుంటున్నారో, ఆ ఆధార స్థంభాన్నే కూల్చేస్తామంటే అంగీకరిస్తారా? అందుకే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున రగిలింది. ఇది కేవలం ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కాదు! 371-డి బదులు రేపు మరో 371-పి తేవచ్చు! హైదరాబాదును సకల ప్రజలకూ రాజధానిగా అంగీకరిస్తూ ఇచ్చిన గ్యారంటీ రద్దు చేస్తారా? ఇది ఒక ప్రాంత ప్రజలకు సరాసరి అన్యాయం కాదా? హైదరాబాదు అందరి రాజధాని అనుకోని 4 దశాబ్దాలుగా రూపొందించుకున్న జీవన ప్రణాలికను కుదేలు చేస్తారా? అంతకుమించి, రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు ఇచ్చిన హామీ ఏమవుతుంది? భారత దేశం దీనికి సమాధానం చెప్పాలి? జాతీయ సమగ్రతకు ఇది భంగకరం కాదా? కోట్లాది ప్రజల శ్రేయోభాగ్యానికి ఇది హానికరం కాదా? పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో 371-డి ని రద్దు చెయ్యవచ్చుగాక! కానీ, అట్టి రద్దు లేవనెత్తే ప్రశ్నలకు అది సమాధానం చెప్పాలి. 371-డి రద్దును ప్రతిపాదించే వాళ్ళు అది ఎట్లా న్యాయబద్ధమో తేల్చి చెప్పాలి. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన ప్రేమ లేఖలతో రాష్ట్ర విచ్చిత్తికి పూనుకున్న వాళ్ళు, 371-డి ని ఎవరిచ్చే ప్రేమ లేఖలతో రద్దు చేస్తారో చెప్పాలి! రాష్ట్ర విచ్చిత్తికి కేవలం రాజకీయ నిర్ణయం చాలు, ప్రజాభిపాయంతో పని లేదన్న వాళ్ళు, 371-డి రద్దుకు కూడా రాజకీయ నిర్ణయం - అధినేత్రి నిర్ణయమే - సరిపోతుందా అనేది చెప్పాలి. ప్రజాభిప్రాయం అవసరం లేకుండానే - భారత దేశ నిర్ణయం లేకుండానే రాజ్యాంగం ఎట్లా తిరగ రాస్తారో చెప్పాలి! ప్రతిపక్షం, ప్రతిపక్షం కలసి - రాజకీయ ప్రయోజనం కోసం - ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా, తేల్చి చెప్పాలి! "డీ" ని ఢీ కొట్ట లేరు! రాష్ట్ర విచ్చిత్తికి కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ అధిష్టానం బరితెగించిన పద్ధతిని చూసిన జన సామాన్యం మేల్కొంది. పల్లెలు, పట్టణాలు లేచి నిల్చున్నాయి. ఈ నేపథ్యంలో 371-డి కి ఇప్పుడు ఎనలేని బలం వచ్చింది. విభజన వాదులు ప్రచారం చేసిన అబద్ధాలు, అవాస్తవాలు, రేపిన విద్వేషం, చిమ్మిన విషం 371-డి ని మరింత అపురూపంగా మార్చేశాయి. దీని అర్థం, పరమార్థం అనంతంగా వ్యాపించాయి. ఇది సమైక్య ఆంధ్రకు ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది. 371-డి రక్షణకు జనం సన్నద్ధం అవుతున్నారు. ఇప్పడు అన్తుకోండి చూద్దాం - 371 డి ని! 371-డి - ఇది యావద్భారత దేశం సాక్షిగా తరతరాలకూ మనం చేసుకున్న ఒప్పందం! దిగ్బంధ, నిర్బంధాల, విష విద్వేషాల రాజకీయం నడిపి, తెలుగు ప్రజలను చీల్చే ప్రమాదం రాకుండా, రాష్ట్ర సమగ్రత విచ్చిన్నం కాకుండాకట్టిన రక్షాబంధనం ఇది! ఈ సందేశం ఊరూ, వాడా - ప్రతి బడిలో గుడిలో వ్యాపింప చేద్దాం! సమైక్యతకు ఇది శ్రీరామ రక్ష! విధ్వంస శక్తులపై ఇది బ్రహ్మాస్త్రం!! Other Posts on 371-D >> http://goo.gl/sVW3H4 http://goo.gl/xgVFwR http://goo.gl/Gqt8Gu http://goo.gl/Vmg2KZ http://goo.gl/j6uhWW What is 371D >> http://indiankanoon.org/doc/1466428/ http://www.indiantelugujaati.com/article-371d.html